: 'మహానాడు వేదిక' ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
తిరుపతిలో మహానాడు వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలు విజయవంతమవడంలో పార్టీకి చెందిన ప్రతిఒక్కరి పాత్ర ఉంది. ముఖ్యంగా, మహానాడు ప్రధాన వేదికను అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వేదికను డిజైన్ చేసింది సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రికతో మాట్లాడుతూ, మహానాడు ప్రధాన వేదికను రూపుదిద్దే అవకాశం పొందిన తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అసలు, ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తిరుపతిలో మహానాడు నిర్ణయించాలని టీడీపీ నిర్ణయించగానే, తాను చంద్రబాబును కలిసానన్నారు. ఇందుకు సంబంధించి తాను రూపొందించిన నమూనాను చంద్రబాబుకు చూపానని, అది ఆయనకు నచ్చడంతో ఈ అవకాశం తనకు లభించినట్లు చెప్పారు. అయితే, ఆ నమూనాలో నాలుగు అంశాలకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారని... అందులో వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైటెక్ సిటీ, అమరావతి అంశాలు ఉన్నాయన్నారు. కేవలం వారం రోజుల్లో 120 మంది యూనిట్ సభ్యులతో మహానాడు ప్రధాన వేదికను నిర్మించానని, ఈ అనుభవాన్ని తన జీవితంలో మరచిపోలేనని చిన్నా పేర్కొన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మొలియాపుట్ట గ్రామానికి చెందిన చిన్నా అసలు పేరు నౌపడ ధర్మారావు. చిన్నా పేరుతో సినీ ఆర్ట్ డైరెక్టర్ గా సుపరిచితుడైన ఆయన పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అధినాయకుడు, పోకిరి, బిజినెస్ మేన్, కెమేరామెన్ గంగతో రాంబాబు, యోగి, నాగవల్లి, దేశముదురు వంటి తెలుగు చిత్రాలకు చిన్నా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా, జూలి-2, వాంటెడ్ వంటి హిందీ చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. ఇప్పటివరకు, హిందీ, తెలుగు చిత్రాలతో కలిపి మొత్తం వంద సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన చిన్నా తల్లిదండ్రులు నౌపడ సింహాచలం, శకుంతలం.