: మహానాడుకు వాడిన పప్పు, ఉప్పుల లెక్క ఇది!
దాదాపు 30 వేల మందికి మూడు రోజుల పాటు ఆతిథ్యం. అల్పాహారంతో పాటు రెండుసార్లు భోజనం. వారిలో సుమారు 1000 మంది ముఖ్యులు. విడివిడిగా వంటశాలలు, నవకాయ వంటకాలతో భోజనాలు... తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు వేడుకల సందర్భంగా తిరుపతిలో కనిపించిన దృశ్యాలివి. మూడు రోజుల్లో మొత్తం 1.5 లక్షల భోజనాలను వండి వడ్డించారిక్కడ. ఇందుకోసం 250 గ్యాస్ సిలిండర్లు, 13 టన్నుల కట్టెలు వాడారు. మొత్తం 100 క్వింటాళ్ల బియ్యం, 50 బస్తాల కందిపప్పు, 50 బస్తాల మినప్పప్పు, 300 క్యాన్ల నూనెతో పాటు పలావ్ కోసం 40 క్యాన్ల నెయ్యి వాడారట. ఇక టన్నుల కొద్దీ కూరగాయలు, పదుల కిలోల కొద్దీ పోపు దినుసులు తీసుకొచ్చారు. ఈ విషయాలను భోజనాల కాంట్రాక్టర్, అంబికాస్ క్యాటరింగ్ యజమాని శివాజీ వెల్లడించారు. ప్రత్యేకంగా 2,500 కిలోల కొత్త ఆవకాయ తయారు చేయించినట్టు ఆయన వివరించారు. 500 కిలోల గోంగూర పచ్చడి తయారు చేయిస్తే, ఒక్క రోజులోనే ఖర్చయిపోయిందని, లడ్డూ, కాజాలను సైతం కార్యకర్తలు తొలి రోజునే లాగించేశారని ఆయన తెలిపారు. తొలి రోజున కాస్త రుచులు అంతగా సంతృప్తి లేదని చెప్పిన ఆహూతులు, ఆపై అన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారని వివరించారు.