: జయంతి మరునాడే ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు!... భగ్గుమన్న ఆదిలాబాదు టీడీపీ నేతలు
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలు దిశలా చాటిన టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహానికి అవమానం జరిగింది. ఎన్టీఆర్ జయంతి మరునాడు ఆయన విగ్రహానికి జరిగిన ఈ అవమానంపై తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే... ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. నేడు తెల్లవారగానే విగ్రహానికి జరిగిన నష్టాన్ని చూసిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామంలో ధర్నాకు దిగారు.