: లోకేశ్ మాటే కరెక్ట్!... రాజ్యసభ సీటు కోసం బీజేపీ నుంచి అభ్యర్థన రాలేదన్న చంద్రబాబు
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య సంప్రదింపులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ప్రకటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుద్ధ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న తిరుపతిలో మహానాడు వేదిక సాక్షిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దీనికి సంబంధించి మరో ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటన తన తనయుడు నారా లోకేశ్ ప్రకటనను సమర్ధిస్తుండగా, అమిత్ షా ప్రకటన తప్పని తేల్చేసింది. వివరాల్లోకెళితే... ఏపీ కోటాలో తమకు ఓ సీటివ్వాలని బీజేపీ... టీడీపీ కోరిందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నారా లోకేశ్ మహానాడుకు వెళ్లే సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ... తమ ముందుకు బీజేపీ ప్రతిపాదనే రాలేదని చెప్పారు. అయితే మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అమిత్ షా... లోకేశ్ ప్రకటనకు విరుద్ధ ప్రకటన చేశారు. ఏపీ కోటాలోని ఓ సీటును ఇవ్వాలని తాము టీడీపీని అడిగామని, ఈ దిశగా ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే నిన్న మహానాడు వేదికగా చంద్రబాబు... సీటివ్వాలని బీజేపీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారు.