: మీరెంత బలవంతం చేసినా జగన్ గురించి మాత్రం మాట్లాడను: కేవీపీ
వైకాపా గురించి, ఆ పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపుల గురించి, పార్టీ అధినేత జగన్ గురించి తాను ఒక్కమాట కూడా మాట్లాడబోనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీవీ చానల్ ప్రత్యేక హోదాపై ఇంటర్వ్యూకు పిలిచి, ఆపై వైకాపా ప్రస్తావన తేగా ఆయన స్పందించారు. ఈ విషయాలన్నీ మరోసారి మాట్లాడుకుందామని, ప్రస్తుతానికి మీరెంత బలవంతం చేసినా జగన్ గురించి మాట్లాడబోనని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే సమస్యే లేదని, వైఎస్ కు దగ్గరైన వ్యక్తిగా, ఆయన మనసులో ఉన్న భావాలే తన మనసులోనూ ఉన్నాయని చెప్పారు. మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలసి పోటీ చేస్తుందన్న విషయమై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, పార్టీ నుంచి వెళ్లినవారు తిరిగి కాంగ్రెస్ తో కలిసే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.