: ఇండియాలో 5 కోట్ల డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవే... కఠిన శిక్షలు తప్పవన్న గడ్కరీ


ఇండియాలో చెలామణిలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల్లో 5 కోట్ల వరకూ నకిలీ లైసెన్సులు ఉన్నాయని, వీరందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 30 శాతం లైసెన్సులు నకిలీవని గుర్తించామని, వీరంతా నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు పొందారని ఆయన తెలిపారు. మొత్తం 18 కోట్ల లైసెన్సులు ఉండగా, వాటన్నింటినీ విశ్లేషించామని, అందులో 5.04 కోట్ల వరకూ నకిలీవి ఉన్నాయని వివరించారు. లైసెన్సింగ్ విధానంలో మరింత పారదర్శకత తీసుకువస్తామని, అందుకోసం ఆన్ లైన్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. రాజకీయ నాయకులైనా, సినీ ప్రముఖులైనా, ఇతర సెలబ్రిటీలైనా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని అన్నారు. నకిలీ లైసెన్స్ దారులు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నకిలీ లైసెన్సులతో తిరుగుతుంటే, రూ. 500 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండింటినీ విధించే అవకాశాలుండగా, శిక్షను రూ. 10 వేల జరిమానా, ఏడాది జైలుశిక్షగా సవరించే ఆలోచనలో ఉన్నట్టు గడ్కరీ తెలియజేశారు. ఒకవేళ నకిలీ లైసెన్స్ దారు మైనర్ అయితే, వాహన యజమానికి రూ. 20 వేల జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నట్టు పేర్కొన్నారు. వారి వాహన రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News