: 50 దిగువకు జగన్ బలం!... 1న టీడీపీలో చేరనున్న అశోక్ రెడ్డి!
ఏపీలో విపక్ష వైసీపీ బలం అసెంబ్లీలో మరింత మేర తగ్గనుంది. గడచిన ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న ఆ పార్టీ విపక్ష హోదాలో కూర్చుంది. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా ‘తలచుకుంటే గంటల్లో చంద్రబాబు సర్కారును కూలగొట్టేస్తా’ అంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సింగిల్ ప్రకటన రాష్ట్రంలో అధికార, విపక్షాల బలాబలాలను మార్చేసింది. జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధికార టీడీపీ... విపక్ష ఎమ్మెల్యేలపై ‘ఆపరేషన్ ఆకర్ష్’ మంత్రాన్ని విసిరింది. ఈ వలకు చిక్కిన 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్కిచ్చి టీడీపీలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి మిగిలిన నికర ఎమ్మెల్యేల సంఖ్య 50గా తేలింది. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి జూన్ 1న టీడీపీలో చేరనున్నారు. జూన్ 1న తన అనుచరులతో విజయవాడకు తరలివెళ్లనున్న అశోక్ రెడ్డి... ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు కానున్న ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ మారనున్నారు. దీంతో వైసీపీ బలం 49కి చేరనుంది.