: కల్లు తాగిన కోతి వైఎస్సార్సీపీ: సీఎం చంద్రబాబు
కల్లు తాగిన కోతి వైఎస్సార్సీపీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. తిరుపతి మహానాడులో ఆయన ముగింపు సందేశమిస్తూ, 'వైఎస్సార్ పార్టీ ఉండదు, మనుగడ సాధించదు, పార్టీ నాయకుడికి క్రమశిక్షణ ఉండాలి, పద్ధతి ఉండాలి, నేరస్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదు' అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను నమ్మిన సిద్ధాంతం, దెబ్బకు దెబ్బకాదని, ప్రజాచైతన్యమే సమాధానమని అన్నారు. ఇదే పద్ధతిలో ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించామని చెప్పారు. ఎప్పుడూ తాను రౌడీయిజం చేయలేదని, అది తన చరిత్ర అని చంద్రబాబు అన్నారు. మనుషులను చంపాలి, భయ భ్రాంతులను చేయాలి, ప్రతిఒక్కరిలో అభద్రతా భావం రావాలి, ఈ రాష్ట్రానికి ఎవరూ రాకుండా, పెట్టుబడులు కూడా రాకుండా చేయాలని కొంతమంది చూస్తున్నారని బాబు మండిపడ్డారు. తాను క్రమశిక్షణ కల్గిన కార్యకర్తనని, పేదరికమే తన కులం, మతం అన్నారు. టీడీపీలోని కార్యకర్తలు సమర్థత, నైపుణ్యత పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ మొదటి, 35వ మహానాడు తిరుపతిలోనే జరుగుతోందని, టీడీపీ చరిత్రలో ఈ ఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. మహానాడులో అందరూ భాగస్వాములయ్యారని ఆయన అభినందించారు. స్వచ్ఛందంగా 851 మంది కార్యకర్తలు రక్తదానంలో భాగస్వాములయ్యారని, స్మార్ట్ విలేజ్ లో 300 మంది కార్యకర్తలు భాగస్వాములవుతామని చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. మూడు రోజుల్లో మొత్తం 380 మంది భారీగా విరాళాలు అందజేశారని, టీడీపీకి 11 కోట్ల 55 లక్షల 8 వేల 59 రూపాయలు విరాళాలుగా అందాయని తెలిపారు.