: రోడ్డు ప్రమాదంలో భగత్ సింగ్ ముని మనవడు దుర్మరణం
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ముని మనవడు అభితేజ్ సింగ్(27) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లోని రామ్ పూర్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అభితేజ్ సింగ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన మిత్రుడు సనావార్ తో కలిసి బైక్ పై బయలు దేరాడు. రామ్ పూర్ సమీపంలోని మ్యాంగ్లాడ్ వద్ద వీరి బైక్ అదుపు తప్పడంతో వారు కిందపడ్డారు. దీంతో, అభితేజ్ సింగ్ తలకు, పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మొహాలీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అభితేజ్ సింగ్ మిత్రులు గురుపాల్ సింగ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదం జరిగినప్పుడు వారి బైక్ వెనకాలే తాను, ఇంకొక మిత్రుడు కలిసి కారులో వెళుతున్నామని, రోడ్డు తడిగా ఉండటం కారణంగా స్కిడ్ అయి, ఈ సంఘటన జరిగిందని అన్నారు.