: బాధ్యత వహిస్తావా? బాధ్యులెవరో చెబుతావా?: తుని ఘటనపై ముద్రగడకు గంటా సూటి ప్రశ్న
తునిలో జరిగిన రైలు దహనం, పోలీసు స్టేషన్లలో విధ్వంసం తదితర ఘటనలకు ముద్రగడ పద్మనాభం బాధ్యత వహించాలని, లేకుంటే బాధ్యులెవరో చెప్పాలని మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాపుల అంశంపై ముద్రగడకు 20 ప్రశ్నలు సంధించారు. కేవలం రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు మాత్రమే ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాపులకు న్యాయం చేసే ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని గంటా తెలిపారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను వేధిస్తోందని, దీనికి శాశ్వత పరిష్కారం కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై రుసుము క్రమబద్ధీకరణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, దాన్ని పరిశీలించి తుది నిర్ణయం వెలువరిస్తామని పేర్కొన్నారు. కళాశాలల నుంచి కమిటీకి అందిన వివరాలను ఆన్ లైన్ లో ఉంచి ప్రజల అభిప్రాయాలను కోరనున్నట్టు వివరించారు. బోధనా సిబ్బంది, మౌలిక వసతులు తదితరాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ ఫీజులను ప్రతిపాదించిందని తెలిపారు. మొత్తం 273 కళాశాలలకు సంబంధించిన ఫీజులను కమిటీ అందించిందని ఆయన అన్నారు.