: గొరిల్లా ఎన్ క్లోజర్ లో పడిపోయిన మూడేళ్ల బాలుడు... గొరిల్లాను చంపి రక్షించిన సిన్సినాటి జూ సిబ్బంది
ప్రమాదవశాత్తూ గొరిల్లా ఉన్న ఎన్ క్లోజర్ లో మూడేళ్ల బాలుడు పడిపోగా, జూ సిబ్బంది దాన్ని చంపి బాలుడిని రక్షించారు. ఈ ఘటన అమెరికాలోని సిన్సినాటి జూలో జరిగింది. జూ డైరెక్టర్ థానీ మేనార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎన్ క్లోజరులో 180 కిలోల బరువున్న 17 సంవత్సరాల హరాంబే అనే పేరున్న మగ గొరిల్లా ఉందని, సదరు బాలుడు పాకుకుంటూ వెళ్లి ఆ ఎన్ క్లోజర్ లో పడడంతో, బాలుడిని చూసి, అతన్ని ఈడ్చుకుంటూ లాక్కెళ్లిందని తెలిపారు. డేంజరస్ ఏనిమల్ రెస్పాన్స్ టీమ్ వెంటనే స్పందించి గొరిల్లాకు మత్తు ఇంజక్షన్ ఇస్తే లాభం లేదని, దాన్ని హతమారిస్తేనే పిల్లాడిని రక్షించగలమని క్షణాల్లో నిర్ణయించుకుని తుపాకులతో కాల్చారని తెలిపారు. తీవ్ర గాయాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించామని, ప్రాణాపాయం తప్పిందని వివరించారు. ఈ తరహా పరిస్థితి రావడం జూ చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు.