: భారత 'న్యూక్లియర్ క్లబ్' విషయంలో పాక్ కు అభయమిస్తున్న అమెరికా!
అణు పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తున్న దేశాల గ్రూప్ (ఎన్ఎస్జీ - న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లోకి వెళ్లాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలను పాక్ తీవ్రంగా నిరసిస్తున్న వేళ, ఆ దేశానికి అమెరికా అభయమిచ్చింది. ఎన్ఎస్జీలో ఇండియా చేరినా, పాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూఎస్ ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. "ఇదేమీ ఆయుధాలను సమకూర్చుకునే పోరు కాదు. అణ్వాయుధాల గురించి అసలే కాదు. అణు శక్తిని పౌర అవసరాల నిమిత్తం వాడుకునేందుకు మాత్రమే ఈ గ్రూప్ పనిచేస్తుంది. పాక్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందనే భావిస్తున్నాం" అని ఆయన అన్నారు. 2015లో అధ్యక్షుడు ఒబామా భారత్ లో పర్యటించిన వేళ, ఇండియాకు ఎన్ఎస్జీ సభ్యత్వం గురించి చర్చ జరిగిందని, ఇండియాకు సభ్యత్వం పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారని టోనర్ గుర్తు చేశారు. పరిజ్ఞానం ఉంటే పాకిస్థాన్ సైతం సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, పాక్ తో పాటు చైనా సైతం ఎన్ఎస్జీలో భారత ప్రవేశాన్ని అడ్డుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.