: జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి: మీడియాతో విద్యార్థి నాయకుడు
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచి దేశ వ్యాప్తంగా రాజకీయ అలజడి రేపిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జాతి వ్యతిరేక నినాదాలు ఇంకా వినబడుతున్నాయి. ఈ విషయాన్ని జేఎన్‌యూ విద్యార్థి, స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ సౌరభ్ శర్మ ఈరోజు జాతీయ మీడియాతో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వర్సిటీలో జాతీ వ్యతిరేక నినాదాలు చేసినవారిలో ఒకరైన ముజీబ్ మళ్లీ అటువంటి చర్యలకే పాల్పడుతున్నాడని అన్నాడు. వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని ముజీబ్ జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్నాడని సౌరభ్ చెప్పాడు. ముజీబ్ జాతి వ్యతిరేక నినాదాలు చేస్తుండగా ఆ దృశ్యాలు ఒక వీడియోలో రికార్డయ్యాయని తెలిపాడు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ కన్నయ్య సహా జేఎన్‌యూ విద్యార్థులు కొన్ని రోజుల క్రితం చేసిన నిరాహార దీక్ష సందర్భంగా ముజీబ్ అక్కడికి వచ్చి, దీక్షకు దిగిన విద్యార్థులను కలిశాడని సౌరభ్ చెప్పాడు.