: హరికృష్ణ నిరసన గళం!... ‘హోదా’ ఇస్తామన్నవారు, తెస్తామన్నవారు ఏం చేస్తున్నారని ప్రశ్న!
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తన సొంత పార్టీపైనే నిరసన గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పేరిట ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. ఓ వైపు పార్టీ వార్షిక వేడుక ‘మహానాడు’ తిరుపతిలో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నా, ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్న హరికృష్ణ... నేడు తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని కొడుకు కల్యాణ్ రాం, సోదరుడి తనయుడు తారకరత్నతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన హరికృష్ణ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిద్దామని ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇంటికొకరు ‘హోదా’ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నవారు, తెస్తామన్నవారు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వెరసి తన సొంత పార్టీ టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ వైఖరిపై ఆయన నిరసన గళం విప్పారు.