: రాణించిన ఫించ్, మెక్ కల్లమ్, కార్తీక్, బ్రావో...హైదరాబాదు లక్ష్యం 163
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాదు జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మన్ ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ ద్వివేదీ (5), రైనా (1) వికెట్లను తొందరగా కోల్పోయింది. అనంతరం మెక్ కల్లమ్ (32), దినేష్ కార్తిక్ (26) రాణించడంతో గుజరాత్ కోలుకుంది. మెక్ కల్లమ్ భారీ షాట్లు ఆడడంతో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించింది. అయితే కీలక సమయాల్లో సన్ రైజర్స్ బౌలర్లు వికెట్లు తీశారు. అనంతరం డ్వెన్ స్మిత్ (1) విఫలం కాగా, లైఫ్ దొరకడంతో దానిని వినియోగించుకున్న ఫించ్ (50) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అనంతరం బ్రావో (20) మెరుపులు మెరిపించగా, రవీంద్ర జడేజా (19) ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ లయన్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కట్టింగ్స్ చెరి రెండు వికెట్లు తీసుకుని రాణించగా, బిపుల్ శర్మ, బోల్ట్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో 163 పరుగుల విజయ లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, ప్రస్తుతం గుజరాత్ లయన్స్ సాధించిన స్కోరు సెమీ ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు చేసిన స్కోరూ ఒకటే కావడం విశేషం. ఆ మ్యాచ్ లో ఇదే స్కోరు చేసిన హైదరాబాదు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుండగా, కోల్ కతా ఇంటిముఖం పట్టింది. ఇప్పుడేం జరుగుతుందో మరో గంటన్నరలో తేలిపోనుంది.