: పరిటాల రవి రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది చంద్రబాబే: భూమన కరుణాకర్ రెడ్డి
పరిటాల రవి రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్, పరిటాల కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయని, వారి మధ్య శత్రుత్వం ఉన్నట్లు నమ్మించడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని అన్నారు. పరిటాల రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి కారకుడు చంద్రబాబేనని, రాష్ట్ర విభజనకు అనుకూలమని నాడు చిదంబంరం, షిండేలకు లేఖలు కూడా ఇచ్చారని అన్నారు. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో రాష్ట్ర విభజనకు అనుకూలమని బాబు చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మహానాడుపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. మహానాడు ఏర్పాటు చేసింది జగన్ పై దాడి చేయడానికేనని అన్నారు. మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసం చేసిన చంద్రబాబు, ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదన్నారు. ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదన్న ఘనుడు చంద్రబాబేనని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై సీబీఐతో ఎంక్వరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.