: మహానాడు ‘నలభీముడు’ మాగంటి బాబు!... దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గల్లా అరుణ


టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’లో వంటకాలపై తెలుగు మీడియాలో ఆసక్తికర కథనాలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ నుంచి కూడా పార్టీ నేతలు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వంటకాలు ఏర్పాటవుతున్నాయని ఎప్పటికప్పుడు మీడియా కథనాల మీద కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ వంటకాల బాధ్యతను పార్టీ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు భుజానకెత్తుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితమే తిరుపతి చేరుకున్న మాగంటి బాబు... ఏ ప్రాంతం వారికి ఏ తరహా ఆహారం ఇష్టమో పరిశీలించి మరీ తయారు చేయిస్తున్నారు. వంటకాలను ఆయన దగ్గరుండి మరీ వండిస్తున్నారు. స్పెషలైజ్జ్ వంటకాల తయారీ కోసం ఆయా వంటకాల్లో చేయి తిరిగిన చెఫ్ లను మాగంటి బాబు తిరుపతికి రప్పించారు. ఇక మాగంటి బాబుకు ఆసరాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వంట గదిలోకి దూరిపోయారు. ఆమెతో పాటు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే, పార్టీ యువనేత శంకర్ కూడా ఈ వంటల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నలభీముడి తరహాలో మాగంటి బాబు వంటలు చేయిస్తుంటే... గల్లా అరుణకుమారి, శంకర్ లు వాటి రుచి చూస్తూ ముందుకు సాగుతున్నారు.

  • Loading...

More Telugu News