: ఆ ఒక్క విషయంలో మీరు మినీ మోదీయే: కేజ్రీవాల్ పై కాంగ్రెస్
సొంత డబ్బా కొట్టుకోవడానికి అధికంగా ఖర్చు పెట్టే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మినీ నరేంద్ర మోదీలాగా తయారయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. దేశ రాజధానిలో నీరు, విద్యుత్ కొరతతో ప్రజలు అల్లాడుతుంటే, అటు ప్రధాని, ఇటు కేజ్రీవాల్ తమ గొప్పల కోసం వ్యాపార ప్రకటనలకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. జలంధర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, పాలనా విధులను మరచిన కేజ్రీవాల్ ఇప్పుడు వ్యాపార ప్రకటనల లెక్కలను మాత్రమే చూసుకుంటున్నారని, ఈ విషయంలో మోదీ, కేజ్రీ ఒకటేనని దుయ్యబట్టారు. దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజలకు దగ్గర కావాలని అటు ప్రధాని, ఇటు కేజ్రీవాల్ యత్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య, అవినీతి, ధరల పెరుగుదల వంటి విషయాల్లో ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఏమాత్రం ఉపశమనం లభించలేదని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి గణనీయంగా పెరిగిపోయిందని ఆరోపించారు. హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, 4 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఏమైందని అజయ్ మాకెన్ ప్రశ్నించారు.