: హైదరాబాదులో సహారా చీఫ్!... వేల మందితో భేటీ కానున్న సుబ్రతా రాయ్!
లక్షలాది మంది మదుపరులను నట్టేట ముంచడమే కాకుండా జనం నుంచి సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అసహనం తెప్పిస్తున్న సహారా పరివార్ చీఫ్ సుబ్రతా రాయ్ నేడు హైదరాబాదుకు వస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై నెలల తరబడి జైలు జీవితం గడుపుతున్న రాయ్ కి ఇటీవలే కోర్టు పెరోల్ మంజూరు చేసింది. తల్లి మరణం నేపథ్యంలో లభించిన పెరోల్ పై జైలు బయటకు వచ్చిన రాయ్.... నేడు హైదరాబాదుకు రానున్నారు. హైదరాబాదులో సహారా గ్రూప్ నకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో పాటు డిపాజిటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. నేడు ఆయన... తన సంస్థ ఉద్యోగులతో పాటు డిపాజిటర్లు, స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్నట్లు సమాచారం. సాంతం ప్రైవేట్ గానే సాగనున్న కార్యక్రమానికి మీడియాకు మాత్రం అనుమతి లభించలేదు. సుబ్రతా రాయ్ హైదరాబాదు వస్తున్న విషయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు ధ్రువీకరించినా, కోర్టు కేసుల కారణంగా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు లేవని తెలిపారు.