: ఆయనకు ఇదేం పిచ్చి అనుకోకండి... రికార్డుల తాతయ్య మరి!
ఢిల్లీకి చెందిన ప్రకాశ్ రిషి (74) ఓ విభిన్నమైన వ్యక్తి. పలు రకాల రికార్డుల కోసం ఆయన ప్రయత్నిస్తుంటాడు. పాశ్చాత్య దేశాల్లో సరదా కోసం, కొత్తగా కనిపించడం కోసం వేయించుకునే టాటూ (పచ్చబొట్టు)లను ఆయన ప్రపంచ రికార్డు కోసం వేయించుకుంటున్నారు. ఇంతవరకు సుమారు 500 టాటూలను ఆయన తన శరీరంపై వేయించుకున్నారు. ఇందులో సుమారు 396 దేశాల జాతీయ జెండాలు ఉండడం విశేషం. వీటితో పాటు ప్రపంచ ప్రముఖులైన మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ, క్వీన్ ఎలిజబెత్, యూఎస్ ప్రెసిడెంట్ ఒబామా ఇలా పలువురి ముఖచిత్రాలను కూడా టాటూలుగా వేయించుకున్నారు. 1942లో ఢిల్లీలో జన్మించిన రిషి, ఆటోపార్ట్స్ ఉత్పత్తిదారుగా ఉంటూ స్నేహితులతో కలిసి 1990లో 1001 గంటలపాటు స్కూటర్ నడిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. నాలుగు నిమిషాల్లో టమోటా కెచప్ తాగి మరో రికార్డు సృష్టించారు. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు పిజ్జా డెలివరీ చేసి మరో రికార్డు ఆయన తనపేరిట లిఖించుకున్నారు. నోట్లో దంతాలన్నీ పీకించుకుని 496 స్ట్రాలు నోట్లో పెట్టుకుని మరో రికార్డు ఆయన సృష్టించారు. ఇలా 20 రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి. ఆయన భార్య బిమల కూడా 1991లో ఒక ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.