: 120 కోట్ల మంది ప్రజలకు సేవకుడిలా పని చేస్తున్నాను: మోదీ


120 కోట్ల మంది భారతీయులకు ప్రధాన సేవకుడిలా పని చేసేందుకు ప్రయాస పడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని షహారన్ పూర్ లో నిర్వహిస్తున్న ఎన్డీయే విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ఇదే సమయంలో ప్రధానిగా ప్రమాణం చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఎంత పని చేశామో దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో కేంద్రంలో రాష్ట్రాల నిధులు మిగిలిపోయేవని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పారు. రాష్ట్రాలు మరింత ఉన్నతపథంలో దూసుకుపోయేందుకు కేంద్రం దగ్గరున్న నిధులను రాష్ట్రాలకు బదలాయించామని ఆయన తెలిపారు. ఈ నిధులతోనే రాష్ట్రాలు గ్రామీణ భారతం రూపురేఖలు మార్చుతాయని ఆయన చెప్పారు. గ్రామీణ జీవనంలో మార్పులు సంభవిస్తే, దేశం అన్నీ సాధించగలుగుతుందని ఆయన అన్నారు. దేశం మార్పు చెందుతోంది కానీ కొంత మంది ఆలోచనలు మాత్రం మారడం లేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాకముందు చెరకు రైతులకు 14 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పారు. చెరకు రైతుల కష్టాలు తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. చెరకు రైతులు ఆకలితో ఉండడాన్ని తాము అంగీకరించమని ఆయన తెలిపారు. వివిధ రూపాల్లో ఆ మొత్తాన్ని రైతులకు అందేలా చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల భూములకు పరీక్షలు నిర్వహిస్తూ వారు ఏ పంటలు పండిస్తే బాగుంటుందో సలహాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News