: డీఎస్ కు తగిలిన లక్కీ చాన్స్... టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వీరే!
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి తన అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వీరిద్దరి పేర్లనూ ఖరారు చేసినట్టు టీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మొదటి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరు వినిపిస్తూనే ఉండగా, రెండో స్థానం కోసం పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కేఎల్ రాజం, వేణుగోపాలాచారి, మైనంపల్లి హనుమంతరావు, గుండు సుధారాణి వంటివారు స్వయంగా కేసీఆర్ ను కలిసి తమకు చాన్స్ ఇవ్వాలని కోరినప్పటికీ, ఆయన డీఎస్ ను ఎంచుకోవడం గమనార్హం. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి డీఎస్ పేరు అధికారికంగా బయటకు రావడంతో, ఆయనకు లక్కీ చాన్స్ తగిలినట్టేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.