: టీడీపీలోకి వెళ్లిపోదామా? కార్యకర్తలను అడిగిన వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా తరఫున పోటీ పడి గెలిచిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మార్గాన్ని ఏర్పరచుకుంటున్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఆయన సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారే విషయమై స్వయంగా చర్చిస్తున్నట్టు సమాచారం. తాజాగా రాచర్ల మండలంలోని ముఖ్య కార్యకర్తలను పిలిపించుకుని, వారితో మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామా? అని ఆయన కార్యకర్తలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా, అశోక్ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెబుతారని దాదాపు నెలన్నర క్రితమే గుసగుసలు వినిపించాయి. అప్పట్లో ఆయన ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాను వైకాపాను వీడబోనని స్పష్టం చేసిన ఆయనే, ఇప్పుడు కార్యకర్తలతో చర్చలు సాగిస్తుండటం గమనార్హం.