: చంద్రబాబుకు కొత్త సమస్య! కుదిరితే లాంగ్ లీవ్, లేకుంటే వీఆర్ఎస్... అమరావతికి వద్దనుకుంటున్న అత్యధిక ఉద్యోగులు
జూన్ 27లోగా హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. విజయవాడ, గుంటూరు సమీప ప్రాంతాల్లోని అద్దెలు, మౌలిక వసతుల కొరతలను సాకుగా చూపుతూ వచ్చిన ఉద్యోగులు, ఇప్పుడు వెళ్లక తప్పని పరిస్థితుల్లో తప్పించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. విజయవాడ, గుంటూరులకు వెళ్లి, ప్రభుత్వ కార్యాలయాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం నుంచి అన్ని విభాగాధిపతులకూ తాఖీదులు వెళ్లగా, ఉద్యోగుల్లో అనేకులు లాంగ్ లీవ్ తీసుకుని ఈ 'వెతుకులాట' సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరింకెంతో మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారని ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాజధానికి ఉద్యోగుల తరలింపునకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకూ ఒక్క కార్యాలయానికి కూడా భవన వసతి కుదరలేదు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద పిల్లర్లు, శ్లాబులు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందనుకున్న విధంగా ఉద్యోగుల తరలింపు సక్రమంగా పూర్తవుతుందా? అన్నది వేచి చూడాలి.