: రాజ్యసభకు పోటీ చేస్తా!.. కేసీఆర్ మద్దతు కోరతా!: టీ కాంగ్ సీనియర్ నేత వీహెచ్


టీ కాంగ్రెస్ సీనియర్ నేత, త్వరలో మాజీ ఎంపీగా మారబోతున్న వి.హన్మంతరావుకు రాజ్యసభ సభ్యత్వంపై ఏమాత్రం మమకారం చావలేదు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా తాను తిరిగి రాజ్యసభకు ఎన్నిక కాలేనని తెలిసినా... ఆయన తనదైన శైలిలో యత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన వీహెచ్... రాజ్యసభకు పోటీపై చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాదులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి ముందు ఓ కొత్త ప్రతిపాదన పెట్టారు. గెలిచే బలం లేకున్నా మరోమారు తాను రాజ్యసభ బరిలోకి దిగుతానని చెప్పిన వీహెచ్... అవసరమైతే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు కోరతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తనకు మద్దతిచ్చేందుకు కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయరని కూడా ఆయన వారికి చెప్పారు. వీహెచ్ ప్రతిపాదనతో ఆలోచనలో పడ్డ ఉత్తమ్, జానాలు... రాజ్యసభ బరిలోకి వీహెచ్ ను దించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News