: తాజా విభేదాలు... భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల!
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టిన వేళ, గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకున్నారు. దీంతో చాగలమర్రి మండలం గొడిగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వర్గీయుల ఆక్రమణలను కాదని, తమ వారి కట్టడాలను మాత్రమే కూల్చుతున్నారని గంగుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. వీరి మధ్య మొదలైన వాగ్వాదం పెరుగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. ఈ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.