: రాజ్యసభకు పంపాలన్న మోత్కుపల్లి!... ఆలోచిస్తానన్న చంద్రబాబు!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నేటి ఉదయం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. తనతో భేటీకి హైదరాబాదు నుంచి వచ్చిన మోత్కుపల్లిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు విషయమేంటని ఆరా తీశారు. తనను ఈసారైనా రాజ్యసభకు పంపాలని ఈ సందర్భంగా తాను వచ్చిన అసలు విషయాన్ని మోత్కుపల్లి బయటపెట్టారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి చేరిపోవడంతో అక్కడ టీడీపీకి రాజ్యసభ సీటు దక్కడం దుర్లభమే. అయితే ఏపీలో అధికారం చేపట్టిన ఆ పార్టీకి మూడు సీట్లు దక్కనున్నాయి. ఈ మూడు సీట్లలోనే తనకు ఓ సీటును కేటాయించాలని మోత్కుపల్లి అభ్యర్థించారు. మోత్కుపల్లి ప్రతిపాదనతో కొంతసేపు ఆలోచించిన చంద్రబాబు... అక్కడికక్కడే స్పష్టమైన హామీ ఇవ్వలేక ఆలోచిస్తానని చెప్పారు. ఈ తర్వాత బయటకు వచ్చిన మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్యసభ సీటిచ్చే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు.