: పదకొండు రూపాయలిచ్చి ఓ మునకేస్తే పాపాలు పోతాయట... ధ్రువపత్రం కూడా వస్తుంది... రాజస్థాన్ దేవాలయంలో సనాతన ఆచారం!


దేవాలయాల్లో ఉన్న పుష్కరిణిల్లో స్నానం చేస్తే, చేసిన పాపాలు తొలగిపోతాయని హిందువుల్లో అనాదిగా ఉన్న నమ్మకం. కానీ, ఈ దేవాలయం మాత్రం మరింత వినూత్నంగా ఆలోచించింది. రూ. 11 కట్టి నీటిలో ఓ మునుగు మునిగితే, పాపాలు పోయాయని చెబుతూ ధ్రువపత్రాన్ని కూడా ఇస్తోంది. ఈ దేవాలయం రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడ దేవుడు శివుడు. గౌతమేశ్వర మహాదేవ పాపమోచనుడు. ఇక్కడున్న చిన్న గుండంలో స్నానం చేస్తే, 'పాప్ ముక్తి' సర్టిఫికెట్ లభిస్తుంది. ఇక్కడ పాపాలు పోయాయని సర్టిఫికెట్ ఇవ్వడం నిన్న మొన్న ప్రారంభం కాలేదట. ఇక్కడ వసూలు చేసే రూ. 11లో, ఒక రూపాయి సర్టిఫికెట్ కోసమని, మిగతా పది రూపాయలూ దోష నివారణ నిమిత్తమని దేవాలయ పూజారి నందకిషోర్ శర్మ చెబుతున్నారు. శతాబ్దాలుగా ఇక్కడీ దేవాలయం ఉన్నట్టు చరిత్ర చెబుతోందని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో పాపముక్తి సర్టిఫికెట్ల కోసం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నెలలో 8 రోజుల పాటు ఆలయ వేడుకలు జరుగగా, దాదాపు రెండు లక్షల మంది గుండంలో స్నానాలు చేశారని తెలిపారు. గౌతమ మహర్షి ఈ ప్రాంతంలో ఓ జంతువును చంపిన పాపాన్ని గుండంలో స్నానం చేసి పోగొట్టుకున్నారని, ఇప్పుడు ప్రజలు తమ పాపాలను తొలగించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారని మరో పూజారి కన్హయ్యాలాల్ శర్మ వివరించారు.

  • Loading...

More Telugu News