: ఆర్డినెన్స్ తెచ్చారు.. సంతోషం.. భవిష్యత్తులోనూ నీట్ వద్దు: జయలలిత
ఇటీవలే తమిళనాడు సీఎంగా వరసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. కేంద్రం నేషనల్ ఎలిజిబిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)పై జారీ చేసిన అత్యవసర ఆదేశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్లూ కొనసాగించిన విధానాన్నే కొనసాగించడానికి కేంద్రం అంగీకారం తెలపాలని అన్నారు. రాష్ట్రానికి ఉన్న హక్కులను నీట్ తో ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నారని, ఈ ప్రవేశ పరీక్షతో విద్యార్థులకు న్యాయం జరగదని ఆమె పేర్కొన్నారు. నీట్ కోసం రాష్ట్రాలపై వత్తిడి తీసుకురావద్దని జయలలిత అన్నారు. ఈ మేరకు ఆమె ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె రాసిన మొదటి లేఖ ఇది. నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో లక్షల మంది విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆందోళన, వత్తిడి తగ్గిందని జయలలిత లేఖలో పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి అభ్యర్థులు తమిళనాడు రూపొందించిన విద్యావిధానంతో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారని, తమ రాష్ట్రంలో ఆ విధానం ద్వారానే శాశ్వతంగా సీట్లు భర్తీ చేయడానికి కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని జయలలిత కోరారు.