: ఏ క్షణమైనా 'పఠాన్ కోట్-2': హెచ్చరించిన నిఘా వర్గాలు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్టే, మరో ప్రాంతంపై ఏ క్షణమైనా ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చని, ఇందుకోసం ఐఎస్ఐ సహకారంతో కుట్రలు పన్నిన జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి ఓ నివేదికను ఇస్తూ, పఠాన్ కోట్ దాడికన్నా భీకర దాడి చేసేందుకు జైషే మహమ్మద్ రెక్కీ కూడా నిర్వహించిందని, ఆ సంస్థ కమాండర్ అవాసీ మహమ్మద్ స్వయంగా మలేషియా మీదుగా భారత్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. పాక్ లోని ఒకారా ప్రాంతానికి చెందిన అవాసీ, తాజా దాడులకు ప్రధాన సూత్రధారని తెలిపింది. ఈ నెల 18న నివేదిక పంజాబ్ ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. ఇండియాలో దాడుల కోసమే పాక్ లో జైషే మహమ్మద్ మరో మూడు కార్యాలయాలను తెరిచిందని ఈ రిపోర్టు పేర్కొంది. దాడులు ఎప్పుడైనా జరగవచ్చని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.