: తెలంగాణను టార్గెట్ చేసిన అమిత్ షా!
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరుస పర్యటనలు చేయనున్నారు. ఈ నెలాఖరుతో పాటు, జూన్ మొదటి వారంలో ఆయన రానున్నారని సమాచారం. మోదీ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధిని ప్రచారం చేయాలని ఎన్డీయే ఇప్పటికే నిర్ణయించగా, అందులో భాగంగా ఈ నెల 29, 30న ఆపై జూన్ నెలలో అమిత్ షా పర్యటనలు చేయనున్నారు. స్వయంగా అమిత్ షానే తెలంగాణకు రావడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటకను తప్పిస్తే, కాస్తో కూస్తో బీజేపీకి బలమున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆ పార్టీకి దాదాపు ఎలాంటి ఉనికీ ఇంతవరకూ లేదు. ఇక ఏపీ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే ఉంది. అందువల్లే అమిత్ షా తెలంగాణను ఎంచుకున్నారని, ఇక్కడ క్యాడర్ బలంగా ఉండటంతో, సరైన లీడర్లు లేని కొరతను తీర్చాలన్నది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది. ఇక బీజేపీ ప్రచారంలో భాగంగా ‘ఊరూరా బీజేపీ - ఇంటింటా మోదీ’ నినాదంతో రాష్ట్రంలో 8 బృందాలు పర్యటిస్తాయని తెలుస్తోంది. ఈ బృందాల్లో 16 మంది కేంద్ర మంత్రులు, ఏడుగురు పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.