: బీజేపీ, ఆప్ సర్కార్ ల పనితీరుకు నిరసనగా... 28న ఢిల్లీలో రాహుల్ గాంధీ ర్యాలీ
ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కరెంట్ కోతలు, మంచినీటి కొరత వంటి సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అజయ్ మాకెన్ ఒక ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజ్ ఘాట్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించ తలపెట్టామన్నారు. ఢిల్లీలో విద్యుత్, మంచి నీటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఆప్ సర్కార్ పై నిరసన తెలుపుతూ 28వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించే టార్చిలైట్ ప్రొసెషన్ కు రాహుల్ నాయకత్వం వహిస్తారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.