: రష్యా వాడుతున్న సిరియా బేస్ పై విరుచుకుపడ్డ ఐఎస్ఐఎస్... తుక్కుగా మారిపోయిన హెలికాప్టర్లు!
తనపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ, అపార నష్టాన్ని కలిగిస్తున్న రష్యాపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సిరియాలో రష్యా వాడుకుంటున్న ఓ ఎయిర్ బేస్ స్టేషన్ పై దాడులు చేసి దాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో రష్యా హెలికాప్టర్లు, ట్రక్కులు, యుద్ధ ట్యాంకర్లు తుక్కుగా మారిపోగా, అందుకు సంబంధించిన శాటిలైట్ ఛాయా చిత్రాలను సేకరించిన బీబీసీ, వాటిని విడుదల చేసింది. సిరియాలో ఉగ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు ఆ దేశ ప్రభుత్వానికి సహకరిస్తున్న రష్యా తియాస్ ఎయిర్ బేస్ ను చాలా కాలంగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ రష్యా యుద్ధ హెలికాప్టర్లు, ఇతర వాహనాలు నిలిపి ఉంచగా, వాటన్నింటినీ ఐఎస్ఐఎస్ పూర్తిగా ధ్వంసం చేసినట్టు బీబీసీ ఆధారాలతో సహా బయటి ప్రపంచానికి తెలియజేసింది. దీనిపై రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు.