: ఎవరెస్ట్ పై కాలుమోపిన నవ్యాంధ్ర తొలి మహిళ నీలిమ
ఎవరెస్ట్ శిఖరంపై నవ్యాంధ్ర ప్రదేశ్ కీర్తీ రెపరెపలాడింది. గుంటూరు జిల్లా వాసి పూదోట నీలిమ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళగా రికార్డుల్లో కెక్కింది. ఈరోజు ఉదయం ఎవరెస్ట్ శిఖరంపై నీలిమ కాలుమోపినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. నీలిమ చిరకాల కోరిక నెరవేరడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన నీలిమ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె తండ్రి శౌరయ్య జర్నలిస్టు. బీటెక్ పూర్తి చేసిన నీలిమ బెంగళూరులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. గత ఏడాది ఏప్రిల్ లో తొలిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లిన నీలిమ నేపాల్ లో భూకంపం కారణంగా తన ప్రయత్నాలను విరమించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు అభినందన... ఎవరెస్ట్ పై కాలుమోపిన నవ్యాంధ్ర తొలి మహిళ నీలిమకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సాహస మహిళగా ఏపీకి, తద్వారా దేశానికి నీలిమ పేరు తీసుకువచ్చిందని చంద్రబాబు కొనియాడారు.