: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ... జూన్ 11న పోలింగ్
పార్లమెంటులో పెద్దల సభగా పరిగణిస్తున్న రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన 57 సీట్ల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ 57 ఖాళీల్లో... తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. తెలంగాణలో గుండు సుధారాణి (టీడీపీ), వి.హన్మంతరావు (కాంగ్రెస్)... ఏపీలో నిర్మలా సీతారామన్ (బీజేపీ), జేడీ శీలం, జైరాం రమేశ్(కాంగ్రెస్), సుజనా చౌదరి (టీడీపీ)ల పదవీ కాలం వచ్చే నెల 30తో ముగియనుంది. వీరి పదవీకాలం ముగిసే నాటికి ఆయా స్థానాల్లో కొత్త వారిని ఎన్నిక చేసేందుకే ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి జూన్ 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం వరకు కౌంటింగ్ కూడా పూర్తి కానుంది.