: మరో కామాంతక బాబా... లైంగిక వేధింపుల కేసులో పరమానంద్ అరెస్ట్
మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై వివాదాస్పద బాబా పరమానంద్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలోని బారాబంకీలో రాంశంకర్ తివారీ అలియాస్ బాబా పరమానంద ఆశ్రమం నడుపుతున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు పిల్లల్ని పుట్టిస్తానని చెప్పి తమతో చెప్పేందుకు వీల్లేని విధంగా అసభ్య చేష్టలు చేశాడని పలువురు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కదిలారు. ఆయన ఆశ్రమంపై దాడి చేయగా, మహిళలతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సీడీలు, పోర్న్ చిత్రాల సీడీలూ వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. పరమానంద మధ్యప్రదేశ్ లోని సాత్నా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని బారాబంకీ పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు.