: కలెక్టర్లతో కేసీఆర్ భేటీకి సర్వం సిద్ధం!... కొత్త జిల్లాల ఏర్పాటుపైనే ప్రధాన చర్చ
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కీలక భేటీ మరికాసేపట్లో జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఓ అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఆయా జిల్లాల నుంచి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. మరోవైపు తమ ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లా మినహా మిగిలిన 9 జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో మొదలు కానున్న కలెక్టర్ల భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో ఈ భేటీపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.