: సీన్ రివర్స్!... వైసీపీ వైపు 'అనంత' టీడీపీ నేత కందికుంట చూపు?
తలచుకుంటే రోజుల వ్యవధిలో టీడీపీ సర్కారును కూల్చేస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఏపీలో పెను రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. జగన్ ప్రకటనపై కన్నెర్రజేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తలూ వినవస్తున్నాయి. చేరికలతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలో భూమా- శిల్పా, ప్రకాశం జిల్లాలో కరణం- గొట్టిపాటి, పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తపల్లి- మాధవనాయుడు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాజాగా అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా... ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరారు. దీంతో అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చాంద్ బాషాను పార్టీలో చేర్చుకునే సమయంలోనే కందికుంట తన వ్యతిరేకతను పార్టీ పెద్దలకు తెలియజేశారు. పరిటాల రవీంద్ర వర్గానికి చెందిన కందికుంటకు చెక్ పెట్టేందుకే ఓ వర్గం నేతలు చాంద్ బాషాను బలవంతంగానే పార్టీలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. చాంద్ బాషా పార్టీలో చేరగానే... అప్పటిదాకా కదిరిలో చక్రం తిప్పిన కందికుంట ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల అక్కడ చోటుచేసుకున్న పలు పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక కందికుంట అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కదిరి టీడీపీ టికెట్ చాంద్ బాషాకే దక్కుతుందని చెబుతున్న వైసీపీ నేతలు... కందికుంట తమ పార్టీలో చేరితే ఏకంగా హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ ఫీలర్లు వదిలారట. చేనేత సామాజిక వర్గానికి చెందిన కందికుంటకు హిందూపురం పరిధిలో మంచి బలమే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీలో తన మాటకు విలువ లేకుండాపోయిందని భావిస్తున్న కందికుంట వైసీపీలో చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.