: కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెడితే సహించబోము: హెచ్చరించిన ముద్రగడ
కాపుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న భవనాలకు చంద్రబాబునాయుడి పేరు పెట్టడం ఏంటని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రికే లేఖ రాసిన ఆయన, చంద్రబాబు పేరు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తమ భవంతులకు 'చంద్రన్న భవంతి' అని పేరు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన ఆయన, తాను చేపట్టిన దీక్ష వెనుక ఎలాంటి రాజకీయ కారణాలూ లేవని తెలిపారు. కాపుల సంక్షేమమే తన లక్ష్యమని, తనకు మద్దతిచ్చిన నాయకులందరినీ వరుసగా కలవనున్నానని పేర్కొన్నారు.