: రాజకీయాల్లో చోటా బచ్చా!... అవినీతిలో సామ్రాట్!: జగన్ పై మంత్రి పల్లె కామెంట్స్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతల విమర్శల వెల్లువ కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిన్న జగన్ పై సరికొత్త కామెంట్లతో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిన్న జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న సందర్భంగా పల్లె చేసిన వ్యాఖ్యలు నిజంగా కొత్తగానే ఉన్నాయి. రాజకీయాల్లో జగన్ ను చోటా బచ్చాగా అభివర్ణించిన రఘునాథరెడ్డి... అవినీతిలో మాత్రం జగన్ సామ్రాట్ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన జగన్ 11 కేసుల్లో నిందితుడిగా ఉంటూ శ్రీరంగ నీతులు చెబుతున్నారు. పట్టిసీమను నిర్మిస్తే వైసీపీకి ఉనికి ఉండదన్న ఉద్దేశంతోనే దానిని అడ్డుకుంటూ రాయలసీమ ద్రోహిగా మారారు’’ అని జగన్ పై పల్లె ఫైరయ్యారు.