: వెంకయ్యకు లైన్ క్లియర్!... కర్ణాటక నుంచే రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇప్పటిదాకా కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న వెంకయ్యకు ఈ దఫా ఆ రాష్ట్ర కోటా నుంచి టికెట్ లభించే అవకాశాలు లేవన్న వదంతులు వినిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న వెంకయ్యను మరోమారు రాజ్యసభకు పంపించాల్సిందేనని కూడా పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాకుండా వేరే రాష్ట్రాల వైపు చూసింది. ఈ క్రమంలో ఏపీ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వెంకయ్యను మరింత టెన్షన్ కు గురి చేసే విషయానికి సంబంధించి వీలయినంత త్వరగా చెక్ పెట్టాలని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం... కర్ణాటక పార్టీ శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పతో మాట్లాడింది. మరోమారు వెంకయ్యకు కర్ణాటక నుంచే అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమంటూ రంగంలోకి దిగిన యడ్యూరప్ప... నిన్న బెంగళూరులో బీజేపీ కర్ణాటక శాఖ కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకయ్యను ఈ దఫా కూడా తమ రాష్ట్ర కోటా నుంచే రాజ్యసభకు పంపాలని కోర్ కమిటీ తీర్మానించింది. దీంతో వెంకయ్యకు రాజ్యసభ సభ్యత్వంపై పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది.