: సింహానికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకే బోనులోకి వెళ్లాడా...?
హైదరాబాదులోని నెహ్రూ జూపార్క్ లో పెద్ద ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుని ఎన్ క్లోజర్ లోకి అడుగుపెట్టాడు. అదృష్టవశాత్తూ క్యురేటర్లు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాగోలులో నివాసం ఉండే ముకేష్ ఎల్ అండ్ టీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం స్నేహితులతో కలసి జూ పార్క్ కు వచ్చాడు. సింహాల ఎన్ క్లోజర్ వద్ద ముకేష్ ను విడిచి స్నేహితులు ఎటో వెళ్లిపోగా... అతడు ఎన్ క్లోజర్ లోకి అడుగుపెట్టాడు. అతడ్ని చూసిన ఓ సింహం అతడి వైపు రాబోయింది. దీంతో అక్కడున్న సందర్శకులు పెద్దగా కేకలు వేయడంతో అది బెదిరి వెనక్కి తగ్గింది. ఇంతలో క్యురేటర్లు అప్రమత్తమయ్యారు. సింహాన్ని అదిలించి ముకేష్ ను పట్టుకుని బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ముకేష్ కు, అతడి భార్యకు మధ్య విభేదాలు ఉండడంతో ప్రస్తుతం అతడు ఒక్కడే ఒంటరిగా నివాసం ఉంటున్నట్టు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకోబోయాడని, సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికే లోపలికి వెళ్లాడని రెండు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.