: పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంలో తప్పులేదు: మంత్రి నారాయణ
కాపుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఆయా పథకాలకు పెట్టడంలో తప్పులేదని మంత్రి నారాయణ అన్నారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... కాపుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,000 కోట్లు ఇచ్చారని... ఇంత వరకు ఆ స్థాయిలో నిధులు ఎవరూ ఇవ్వలేదన్నారు. ఈ నిధులతో కాపుల ఆర్థిక వృద్ధి ఎన్నో రెట్లు మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కమిషన్ ను కూడా వేశారని, ఆ పని నడుస్తోందన్నారు. గతంలో ఎవరూ ఈ స్థాయిలో చేయలేదు కాబట్టి కాపుల సంక్షేమానికి సంబంధించిన పథకాలకు ఆయన పేరు పెట్టాలని కాపు నేతల అభిప్రాయంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టుకున్న సందర్భాలను మంత్రి నారాయణ గుర్తు చేశారు. అలాగే, తమిళనాడులో ప్రభుత్వ పథకాలకు అమ్మ (జయలలిత) పేర్లు పెడుతుండగా... ఇక్కడి పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంలో తప్పేముందన్నారు. అయితే, పేర్లు పెట్టేముందు పద్ధతి ప్రకారం తన అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని, ఇకపై ఆయన అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.