: యోగా ప్రారంభిస్తున్నారా.. అయితే, ఈ తప్పులు జరగకుండా చూసుకోండి!
నిండైన ఆరోగ్యానికి, శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. మనలోని లోపాలను మనం అధిగమించడానికి సహాయపడుతుంది. కానీ, చాలా మంది కనీస అవగాహన కూడా లేకుండా యోగా అభ్యాసన ప్రారంభిస్తున్నారు. అలా చేయడం వల్ల యోగాతో వచ్చే ప్రయోజనాలేమోగానీ.. చాలా మంది ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. అవగాహన లేకుండా యోగా చేయడమంటే ఈదడం తెలియకుండా లోతైన నీటిలోకి దిగడం వంటిదే. అందువల్ల యోగా ప్రారంభించే ముందు కీలకమైన నాలుగు అంశాలను గుర్తుంచుకోవాలి. 1. యోగా అభ్యాసాన్ని కొత్తగా చేపట్టేవారు సులభ అభ్యాసాలతోనే ప్రారంభించాలి. క్లిష్టమైన యోగా ప్రక్రియలను సరిగా అభ్యసించడం రాకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. అందువల్ల బేసిక్ యోగా కోర్సులో చేరడం ఉత్తమం. 2. యోగా చేసేవారు సరైన వస్త్రాలను ధరించడం మంచిది. శరీర పరిమాణం కనిపించకూడదనే ఉద్దేశంతో బాగా వదులుగా ఉన్న దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అది సరికాదు. అలాగని బాగా బిగుతుగా ఉండేవీ ధరించొద్దు. సరిగ్గా శరీరానికి సరిపోయేలా, సాగే గుణమున్న వస్త్రాలను ధరించడం ఉత్తమం. 3. యోగా అనేది శరీరాన్ని బాగా వంచేందుకో, కష్టతరమైన ఆసనాలను కూడా వేసేందుకో కాదు.. యోగా అనేది శరీరాన్ని, మనసును అనుసంధానం చేసే ప్రక్రియ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందువల్ల ఇతరులు చేస్తున్నారు, మేం చేయడం లేదనే న్యూనతా భావనను పక్కన పెట్టి అభ్యాసన చేయండి. తొలుత మీ శరీరానికి సరిపడే యోగా ఆసనాలను ఎన్నుకోండి. కొద్ది కాలంలోనే మీ శరీరం కూడా అన్ని రకాల ఆసనాలను వేసేందుకు సిద్ధంగా రూపొందుతుంది. 4. కడుపునిండా ఆహారం తీసుకుని యోగా అభ్యాసన చేయవద్దు. ఎందుకంటే, తిన్న తర్వాత ఆహారంలోని శక్తిని, పోషకాలను సంగ్రహించడానికి కడుపు ప్రాంతంలోకి రక్తం ఎక్కువగా చేరుతుంది. దీంతో కండరాలకు వేగంగా శక్తి అందించలేదు. అందువల్ల యోగా అభ్యాసన సరిగా చేయలేం. ఒక వేళ ఆకలిగా ఉంటే ఏవైనా ఒకటి రెండు పండ్లుగానీ, స్వల్పంగా అల్పాహారంగానీ తీసుకోవచ్చు.