: ఓటమి శాశ్వతం కాదు: కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన సోనియా గాంధీ
ఐదు రాష్ట్రాల ఫలితాలతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గెలుపు, ఓటములు శాశ్వతం కాదని అన్నారు. విలువలు శాశ్వతమని ఆమె చెప్పారు. కార్యకర్తలు విలువలకు కట్టుబడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. నైతికతను వదిలి పెట్టి సాధించిన విజయాలు శాశ్వతంగా ఉండవని ఆమె సూత్రీకరించారు. తాజా ఎన్నికల్లో ఎదురైన పరాజయం పునరావృతం కాదని ఆమె ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ తన చివరి బొట్టు వరకు సామాజిక సామరస్యం కోసం పాటుపడ్డారని, ఆయన చూపిన దారిలో నడవాలని ఆమె కార్యకర్తలకు ఉద్బోధించారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ తనదైన ముద్రవేశారని ఆమె కీర్తించారు.