: హోదా తేవ‌డ‌మంటే దొంగ లెక్క‌లు రాసుకున్నంత ఈజీ కాదు.. కష్టపడి తేవాలి: ఏపీ సీఎం


రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ప‌డ‌బోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తాను ఢిల్లీకి వెళ్లి ఇంత‌గా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోందంటే దానికి కాంగ్రెసే కార‌ణమంటూ విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ప్ర‌త్యేక హోదాపై రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ప్ర‌తిప‌క్షాలు మ‌భ్య‌పెడుతున్నాయ‌న్నారు. హోదా వస్తే అది వస్తుంది, ఇది వస్తుందంటూ ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. ‘హోదా తేవ‌డ‌మంటే ఇంట్లో కూర్చొని దొంగ లెక్క‌లు రాసుకున్నంత ఈజీ కాదు.. కష్టపడి తేవాలి’ అని ప్ర‌తిప‌క్షాల‌ను ఎద్దేవా చేశారు. ఏ విష‌యానికైనా క‌ష్ట‌ప‌డాల‌ని, అప్పుడే మ‌న‌కి కావాల్సిన ప్ర‌యోజ‌నాలు అందుతాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘హోదా ఉన్న రాష్ట్రాల్లో వ‌న‌రులు కూడా ఉన్నాయి.. అయినా అవి అభివృద్ధి ప‌థంలో న‌డుస్తున్నాయా’..? అని చంద్రబాబు నాయుడు ప్ర‌శ్నించారు. ఆంధ్ర ప‌డిన‌న్ని ఇబ్బందులు చ‌రిత్ర‌లో మ‌రే ఇత రాష్ట్రం ప‌డ‌లేద‌ని చంద్రబాబు అన్నారు. ‘ఒక‌ప్పుడు చెన్నైని డెవ‌ల‌ప్ చేశాం, అనంత‌రం మొద‌టి భాషా ప్ర‌యుక్త రాష్ట్రంగా ఆంధ్రప్ర‌దేశ్ ఏర్ప‌డింది. మొద‌ట‌ క‌ర్నూలు రాజ‌ధానిగా ఉండేది, చివ‌రికి హైద‌రాబాద్ రాజ‌ధాని అయింది. హైద‌రాబాద్ నూ డెవ‌ల‌ప్ చేశాం. అక్క‌డి నుంచి మ‌ళ్లీ క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌చ్చాం. ఇప్పుడు అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేస్తాం. గ‌తంలో అన్ని రాజ‌ధాని న‌గ‌రాల‌నూ డెవ‌ల‌ప్‌ చేశాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని డెవ‌లప్ చేయ‌డం త‌థ్యం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు కొన్ని త్యాగాల‌కు సిద్ధ‌ప‌డాలని, అమ‌రావ‌తి నుంచి చ‌క్క‌ని పాల‌న‌ను అందిద్దామ‌ని ఆయ‌న ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News