: 170 మంది కోటీశ్వరులే... అత్యంత ధనిక అసెంబ్లీగా తమిళనాడు అసెంబ్లీ


కొత్తగా ఏర్పడిన తమిళనాడు అసెంబ్లీ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ధనిక అసెంబ్లీగా రికార్డు సృష్టించింది. ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల్లో 170 మంది కోటీశ్వరులు గెలిచి అసెంబ్లీలో కాలుమోపనుండటమే ఇందుకు కారణం. నామినేషన్ల సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అసెంబ్లీకి వెళ్లిన కోటీశ్వరుల జాబితాలో రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్న ముఖ్యమంత్రి జయలలితతో పాటు, రూ. 337 కోట్ల ఆస్తులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నెంగునేరి వసంత్ కుమార్, రూ. 170 కోట్లకు పైగా ఆస్తులతో డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ తదితరులు ఉన్నారు. ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ రూ. 100 కోట్లకు మించిన ఆస్తులున్న వారున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోటీపడి గెలిచిన వారిలో 83 శాతం మంది కోటీశ్వరులు కాగా, తమిళనాడులో 76 శాతం మంది ధనికులు గెలుపొందారు. ఇక తమిళనాడులో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 8.21 కోట్లుగా తేలింది. ఇక గెలిచిన వారిలో 31 నుంచి 70 ఏళ్లున్నవారి సంఖ్య తమిళనాడులో 170గా ఉండగా, 30 ఏళ్లలోపు వారు, 90 సంవత్సరాలు దాటిన వారు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. తమిళనాడులో 60 శాతం మంది గ్రాడ్యుయేట్ లేదా పీజీ చేసిన వారుండగా, పశ్చిమ బెంగాల్ లో 67 శాతం ఎమ్మెల్యేలు విద్యాధికులు. కేరళలో 62 శాతం మంది గెలిచిన వారిపై క్రిమినల్ కేసులు ఉండగా, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో 37 శాతం మందిపై కేసులున్నాయి. వీరిలో తీవ్రమైన నేరాలు చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News