: పంజాబ్ లో 'ఆప్' ముందుంది... ఆ పరిస్థితిని మేము మారుస్తాం!: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్


వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ, పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి తాము అనుకూలంగా మార్చగలమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఆ రాష్ట్రంలో అకాలీలు ఇప్పటికే పోటీ నుంచి తప్పుకున్నట్టని, ఇక కాంగ్రెస్, ఆప్ ల మధ్యే ప్రధాన పోటీ సాగనుందని కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రశాంత్ స్వయంగా వెల్లడించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించి పలు కీలక సమావేశాలు నిర్వహించిన ఆయన కాంగ్రెస్ విజయం సాధించేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని, ఎటొచ్చీ వాటిని సక్రమంగా వినియోగించుకుంటే చాలని పేర్కొన్నారట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున పరిస్థితిని మార్చి చూపిస్తామని ఆయన తెలిపారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన కేజ్రీవాల్, ఆ రాష్ట్రంలో వీలుచిక్కినప్పుడల్లా పర్యటిస్తూ, పార్టీ మూలాలను బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు పంజాబ్ లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా కేజ్రీవాల్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయన్ను అడ్డుకుని పంజాబ్ లో తిరిగి అధికారాన్ని సంపాదించడమే ధ్యేయంగా ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News