: పార్లమెంటు నుంచి పంచాయతీల వరకూ మావే!: అమిత్ షా
దేశంలో బీజేపీ మరింతగా విస్తరించేందుకు సమయం ఆసన్నమైందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు నుంచి పంచాయతీల వరకూ పార్టీ ఆధిపత్యం చూపించే రోజులు ఎంతో దూరంలో లేవని, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అసోంలో తమ పార్టీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిందని, కేరళలో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుందని అన్నారు. "మేము స్వల్పకాల లక్ష్యాల గురించి ఆలోచించడం లేదు. మాకున్న కార్యకర్తల బలంతో, ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణల అండతో, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామన్న నమ్మకముంది. గడచిన రెండేళ్లలో 11 కోట్ల మంది బీజేపీలో చేరారు. వీరిలో అత్యధికులు యువతే" అని అన్నారు. బీజేపీ విస్తరించేందుకు నరేంద్ర మోదీ 2014 విజయం ఓ విత్తనమని, అదేమీ రహస్యం కాదని ఆయన అన్నారు. తమ లక్ష్యం చిన్నది కాదన్న సంగతి తెలుసునని చెప్పారు. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయం తమదేనని అమిత్ షా అంచనా వేశారు.