: బ్యాక్ టూ పెవిలియన్... మళ్లీ సినిమాలు చేస్తానన్న విజయకాంత్!
సీఎం కుర్చీ తనదేనని బీరాలుపలికి, కనీసం ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన, డీఎండీకే, ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా, ఆ పార్టీ అధినేత విజయకాంత్ తిరిగి సినిమా రంగంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారమే తన తాజా చిత్రం షూటింగ్ మొదలైందని, మళ్లీ బిజీ అయిపోయానని తెలిపారు. తన గెలుపు వాయిదా పడిందని, ఇందుకు మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు విజయకాంత్ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాగా, విజయకాంత్ ను, ఆయన పార్టీ అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించగా, విజయకాంత్ 47,526 ఓట్ల తేడాతో అన్నాడీఎంకే అభ్యర్థి కుమరగురు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో పోటీచేసిన సినీ ప్రముఖుల్లో అత్యధిక తేడాతో ఓడిపోయింది విజయకాంతే కావడం గమనార్హం.